ఉత్తిష్ఠ నరశార్ధూల!

“దేవి, నేను వెళ్ళాలంట” అని మందవదనంతో అన్నాడు రాముడు, తన మందహాసాన్ని ఇందువదనాన్ని పక్కన పెట్టి. ఒకే ఒక క్షణం తన చేతి వద్ద పరుగులిడుతున్న ఉడుతపై చూపు విసిరి తిరిగి లాక్కున్నాడు. సీతమ్మ విసిరే అడవి పళ్ళ చేత ఆ ఉడుత, వటుడి కంటే వేగంగా ‘ఇంతయ్యిం’ది. తను విసిరిన చూపుకు కారణం తన ముందు నిలుస్తున్న విరహమే. ఎంతో ఆవేశముతో మరోప్రపంచపు పిలుపులు ఘొల్లుమంటున్నాయి. ఆ ప్రపంచంతోపాటు రాముడి అవస్థ మారుతున్నది. రాముడన్న మాటకు సీత కాస్త మొహం చిట్లించుకొని అడిగింది: “వెళ్ళాలా? నాకు తెలియని, అందని పిలుపా? ఇదేమి విచిత్రము?” అని ప్రశ్నిచింది. “మరి నేటి కాల మహిమ అట్టిది ప్రియ. నీ స్మరణ లేనిది నా నామము లేదన్నట్టు గా ఇమిడి ఉన్నాము కానీ నా ఈ కొత్తింట్లో, ఏకాకిని అవ్వాలని నా పై ఆజ్ఞ. ఐదేళ్ళ పసివాడిని అట. అది నా జన్మస్థానం అట; వాల్మీకి అదే నా జన్మస్థానం అని అన్నాడట.” ఈ లోపల ఉరకలు తీస్తున్న ఉడత సీతాదేవి చేతిమీద తాను ఎంగిలి చేసిన పండ్ల, విత్తనాల ముక్కలను విడుస్తూ ఉంది. సీతమ్మ కాస్త అయోమయపు నవ్వుతో అర్థమయికానట్టు, “మన ప్రేమలో శాశ్వతమై ఉన్నది వియోగమే కదా మరి” అని అనేసింది, గాలిలో గాలితో మాట్లాడుతూ. కానీ అందులో వింత ఏముంది? తాను ఖిన్నురాలై సముద్ర దూరంలో ఒంటరిగా ఉన్నప్పుడే రాముడు ఆ గాలితోనే అన్నాడు మరి “వీచి, తనను ముట్టుకొని నా వద్దకు రా” అని, – నీవే మా మధ్య స్పర్శ కాజాలవు అని. తిరిగి ఆ వ్యథకై సిద్ధ పడుతున్నట్టుంది కాబోలు. నిశ్శబ్దపు తెరల వెనక తను కాలచక్రంలా మత్తెక్కించే వేగంతో తిరుగుతుండగా రాముడి ఆవేదనా నివేదనలు, ఆ చలనాన్ని ఖండించి తనను చూడమని బ్రతిమాలాయి. 

“నేను అక్కడ ఉండలేననిపిస్తుంది” అని అన్నాడు రాముడు. కారణం అడిగింది సీత, ఏమో పెద్ద ఎమీ తెలియని అమాయకురాలిలా. రాముడు జవాబు వెతుకుతూ ఏ లక్ష్యం లేక ఏటో చూసాడు. ఈ లోపల “అవును అది కంబడే కదూ” అని అంటూ, తానె, “అవును లే కంబడే – ఎంత సొగసుగా మన కఠోర కాంతార ప్రణయ విహారాన్ని వివరించింది. మన చిత్రకూట నివాసాన్ని చిత్రీకరించింది.” సీత చిన్నగా నవ్వింది – ఎంతైనా రాముని మనసులో ఉన్నది తనకు తెలుసు కదా, బహుశా రాముడికే తెలియనంతగా. “ఆ కంబ కావ్యంలో నేను వెదురు కాడల మీద రాలిపడ్డ కుబుసచర్మాన్ని అయోధ్యానగరపు విజయధ్వజాలతో పోల్చినపుడు, అది కేవలం ఊరట కోసం కాదు. నేను వనవాసాన్ని అంతగా ఆస్వాదిస్తాను, ఎంతగానంటే…” అని హడావుడి పడి, చివరికి, “నీ అంతగా” అని ఊరుకున్నాడు. “అడవి యొక్క ముగ్ధ శోభను, పచ్చని సౌందర్యాన్ని, అవధి లేని శృంగారాన్ని ఎంతగానో ప్రేమిస్తాను. నిన్ను ప్రేమించానట్టే, భుమిజాస్రీ.” అదిగో – దొరికింది సీత అడిగిన కారణం. 

వెలివేతకు పెట్టింది పేరైన తన భర్తకు అందిన ఈ ఆహ్వానం ఆయనకు మరో వెలివేత వంటిదే అన్న అలోచన చేత సీత నివ్వెర పోయింది. తనకంటే ముందే ఉర్దూ కవి కైఫీ ఆజ్మి నేటి మందిర స్థానంలో ఉన్న ముఘలాయి కట్టడం కూల్చి వేయబడ్డ నాడు ఆ చర్యను ‘రెండవ వెలివేత’ తో పోల్చడం గుర్తు చేసుకుంది. ఆ శయిర్ విన్నప్పుడే తన బిడ్డలా ఆ కవిని లాలించింది సీతమ్మ. అలాంటిది ఆ శిథిలాలపై, తాను దూరం ఉంచిన సుఖాల మధ్య పట్టాభిషేకం జరగబోతుందని గమనించి ఆమె – “అయ్యో ఏ స్థితి వాటిల్లుతోంది మీకు!” అని అనబోయి తనను తాను ఆపుకోండి. రాముడే స్వతః గా విలపించింది చాలు అని. 

పైగా ఆ మాట స్థానంలో, లేని ఆనందం తెచ్చుకొని సీత, “రామా ఒక సారి నీవు లంక నుంచి అయోధ్యకు మనం తిరిగొచ్చిన రోజును గుర్తు తెచ్చుకో. ఆరోజు యొక్క పునరాగమనం లా లేదు ఈ ముహూర్తం?” అని ఓదార్చడానికి ప్రయత్నించింది. రాముడు కాస్త తలాడిస్తూ, పక్కకు ఉన్న రాయిని ముట్టుకొని, తన చేతిని వీక్షించి, చివరికి విరుచుకుపడ్డాడు. “అవును సీత. జ్ఞాపకం లేకేమి. మనం దిగ్విజయం తో అయోధ్యకు రావడం నిజమే కావచ్చు కానీ ఆనాడు భరతుడు నిర్వహించిన స్వాగత సన్నాహాలు గుర్తు తెచ్చుకో. కోసల ప్రజానీకం ఎంత కోలాహలంతో ఉన్నా, మనలో వేరే రసమే నిండి ఉంది. నా సన్నిహితులు ఎవరు ఆనాడు? జాంబవంతుడు గుర్తు ఉండే ఉంటాడు. ఎంత తత్త్వం కలవాడు అతడు. తన దరిదాపులకు నేను తూగుతానా?” సీత ప్రేమతో రామునికి దగ్గరయ్యింది, తన దుస్తులు చిన్నగా ఉసురుసురనేలా, తన గాజులు చిన్నగా గలగల మనేలా. రాముడి సొంత లోపం ఎంచే ప్రగాఢ నమ్రతనే అతనిపై అంత అనురాగం వికసించేలా చేసింది. “పోతే సుగ్రీవుడు. ఘనమైన పశ్చాత్తాపాన్ని మోసిన వాళ్లము – ఇద్దరు మా మా పడతిని రాజ్యాన్ని తిరిగి సాధించినా, ఎంచుకున్న శోకాన్నే ఆభరణంగా ధరించిన వాళ్ళము. హనుమంతుని గురించి చెప్పడానికి నా మాటలు చాలుతాయ? వైవాహికస్నేహానికై తను పడిన శ్రమ ఎటువంటిది?” ఈలోగా చుస్తే సీత చేయి రాముని చేతిపై పడుకుని ఉంది. తన చెయ్యే ఆ క్షణంలో సేతుబంధము. మరే సాగరమూ అడ్డు రాకూడదని తృష్ణ. ఆ నల్లటి వేలుపు సీత వంక ఓరకంట చూసినాడు. చూసి మెత్తగా పలికాడు: “ప్రియ, ఆనాటి గురించి నాకు మనసైనది విజయోత్సాహం కాదు. ఆ ఉత్సాహపు కాఠిన్యం లోపల చింతన యొక్క  చల్లటి, తీయటి నీళ్ళు ఉండినాయి.” ఆ దంపతులు విషాదస్మితాలు విడిచారు. “కానీ నేడు చూడు సీతా” అని తిరిగి మొదలెట్టాడు రాముడు, “ఒక యువరాజులా, అనర్హమైన రాజస్సుతో, కలుషితమైన తామసమైన తళుకు బెళుకు తో ఆహ్వానితుడిని అయినాను. ‘అహంకారమే’ నన్ను చేయి పట్టుకొని తీసుకెళ్ళుతున్నది – లేకుంటే నేను దారి తప్పి పోతాను అని కాబోలు. ఎక్కడ సీతా, మన గాథలో ఉన్న ఆ నిధానము, ఆ స్థితప్రజ్ఞత ఏది? నాకు కనిపించదే ఈరోజు.” ఈ పాటికి అస్తవ్యస్తంగా ఉన్న రాముడు బాష్పావధి లో కేకలు వేసాడు, “నా జీవితాంతం ఎందరు నన్ను దేవునిలా చూసినా, నేను తిరస్కరించాను. లేదు అని మారాం చేశాను. ఎంత వింతో చూడు – నేడు కొందరు వ్యక్తులు దేవుళ్లగా మారుతుంటే రాయిలా తిలకిస్తున్నాను.”   

సీత తన చేతులతో రాముని వీపుని తెరలా కప్పింది. మృదువుగా తన గడ్డాన్ని అతని భుజంపై కుర్చోపెట్టింది. తన చూపులను చిన్న చిన్న అడుగులు వేయనిచ్చి తొలుత రాముడి తీగల వంటి వెంట్రుకలను, ఆ తర్వాత అతడి పెద్ద చెవులను చూసింది. ఆ విధంగా బాహ్య సంపదను చూసినట్టు అనిపించినా, ఆమె నిజానికి దర్శించింది తన భర్తలోని భావాలనే. తన చూపులు అడుగులు వేస్తుండగా, ‘రాముడు చెప్తున్నది సత్యమే కదా’ అని అనుకొన్నది. ఎల్లప్పుడూ తాను సామాన్యుల దేవుడే కదా. అల్పులకు, సుక్ష్ములకు, నిరాదరణ కొన్న వారకు, ఆర్తి తో చూసే వారికి, ఓర్పు గలిగినవారికి, ఎదురు చూసిన వారికే కదా తను అనుగ్రహం చేకూర్చింది. ఈమెనే దృష్టాంతం. తన పొడవాటి, నిగనిగలాడే జడపై చేయి వేసి, ప్రేమతో కాస్త కురులను ఆడించి – వాటికి అవే జడలు కట్టేసిన రోజులను స్మరించుకుంది. నేటిలా బంతి పూలు చుట్టని రోజులు గుర్తుకొచ్చాయి. తను నిరీక్షించలేదా? సాక్ష్యాత్తు రాయిగా మారిన అహల్య ఎదురు చూపు ఎక్కడ పోవాలి? రాముడిని పెనవేసుకున్న శబరి ప్రేమను చుస్తే ఈమె కూడా అసూయ చెందకుండా ఉండలేదు. సంకెళ్ళలో బందిగా ఉన్న గోపన్న ఆర్తనాదాలు ఆమెకు గుర్తొచ్చాయి, త్యాగయ్య ఆర్ద్రత తో తడిసిన ఆయన కృతులు గుర్తొచ్చాయి. వారి భావన వినయాన్ని మించినది ఏదో. రాముడు ఇంకో మంచి మాట కూడా అన్నాడనిపించింది సీతకు. రాముడిని మనస్పూర్తిగా ప్రేమించిన వారి మనోఫలకం లో వారిద్దరూ కలిసే ఉంటారు. పైగా ఆమెను వారిలో ఒకరిగా లేక్కేస్తూ ఉంటారు. వారందరూ కూడా ఆయనకై అసహనంతో, కానీ ఓర్పు తో ఎదురు చూసే సఖులే కదా. ఆమె లాగ. అలంటి ఎదురుచూపు నడుమ, సీతమ్మ ద్వారా రాములవారికి వారి వేదన-వాంఛలు విన్నవించుకున్నారు. గోపన్న సీతను, “నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి… లోకాంతరంగుడు శ్రీకాంత నిను గూడి ఏకాంతమున ఏక శయ్యనున్న వేళ…” అంటూ కదిలించాడు. ఈ దాస్య భావము నుండి త్యాగయ్య దూరమయ్యింది లేదు కానీ సీతమ్మకు ప్రత్యేకంగా ఒక కీర్తనంటే మహా మక్కువ: “మా జానకి చేతపట్టగా మహారాజువైతివి” అట! ఇప్పుడు ఆమె లేక రామస్వామికి ఒక రాచనగారా? అదే క్షణం ఆమె ఒంటరిగా “ఏక్ల చలోరే” అని పాడుకున్న ఆ ముసలివాడి గురించి ఆలోచించింది. ‘రాముని పేరు దాల్చిన ఒక హంతకుని గుండు తిని ప్రాణం ఒదిలిన నిమిషం కూడా రాముడి పేరే కదా పిలిచింది’ అని గుర్తు తెచ్చుకుంది. 

అంతలో రామయ్య లేచినాడు. ఆడుతున్న గాలికి అడ్డుగా స్తంభంలా నిలుచున్నాడు. సీతమ్మ మాత్రం పిలుపినిచ్చి సూటిగా అడిగింది: “ఐతే ఎందుకు ఈ ఆలయం? ఏమిటి ప్రమాణం? అసలు అంత అర్థహీనమా?” రాముడు అంతే సూటిగా బదులిచ్చాడు: “అది ప్రజాకాంక్ష అట. జనాలు కోరుతున్నది ఇదేనట.” ఒక క్షణం సీత ఆగి, తిరిగి రాముణ్ణి వెంబడించింది. ఏమి అనలేదు. ఉలుకు పలుకు లేదు. సీతాదేవి లో నుంచి ఇంతసేపు లేని ఎదో కొత్త ఛాయ వెలువడింది. తన నిశ్శబ్దమే ప్రపంచాన్ని గగ్గోలు పెట్టినట్టయ్యింది. ఆ నిశ్శబ్దాన్ని తానే ధ్వంసం చేసి: “ఐతేనేం? అది నీవు నమ్మిన న్యాయం కాదా?  నీవు నీ ప్రజలను సంతోష పెట్టాలని తపన పడవా?” సీత కళ్ళను చూడాల్సిన గతి ఆ క్షణం రాముడి మీద పడనందుకు సంతోషించాడు రాముడు. ఆమె చెప్పింది అక్షరాలా సత్యం కదా మరి. రాముడి రాజనీతినే నేటి ఒక దొర అమలులో పెట్టాడు. తనకు సూర్యవంశ సంప్రదాయం అని రాజధర్మంగా బోధింపబడిన విధానాన్నే ఇంకొకరు, సృజన లేకుండా, నేడు పాటిస్తున్నారు అని రాముడికి అవగతం ఐనది. తను ఎంత విచారించినా, నేటి ఈ ఉద్యమానికి తను తొక్కిన దారే ప్రమాణం. కాకపోతే ఈ పురాణ పురుషుడు తనను ప్రేమించిన భార్యను, ఆమె పట్ల అతడికి ఉన్న బాధ్యతను పణంగా పెట్టి, ఈ ‘రాజధర్మాను’సారం ప్రవర్తించి ఉన్నాడు. తాను ఎనలేని తేనెపలుకులతో కీర్తించిన ఆ ఘోరారణ్యంలోకే భార్యను నెట్టాడు. ప్రతి రాత్రి సీత ఏ పులి నోటనో పడుతుందేమోనని తల్లడిల్లినా, ఆమె బాగోకలను విచారించలేకపోయాడు. రాముడి గుండెను పరిమళపు పూవుగా వికసింప జేసిన భవభూతి కలంలో సీత స్నేహితురాలయిన వసంత అడిగినట్టు, “అపకీర్తి నీ ప్రాణంలా నువ్వు ప్రేమించే నీ భార్యనుంచి దూరంగా ఉండి అనుభవించే వియోగం కంటే ఘోరమా?” 

లోకుల మాటకు బానిస అన్న వాదనకు రాముడి దగ్గర బదులు లేకపోలేదు. తాను ప్రజల మాటను గుడ్డిగా అనుసరించిన వాడు కాదు. లోకాభిరాముడు అనగా అర్థం అది కాదు – అని తను తిరగబడ్డాడు. జనాలు రమిస్తే చాలదు, అందరు – ప్రతి ఒక్కరు సమ్మతించాలి. ఏ ఒక్కరికి కష్టం వాటిల్లరాదు. ఇలా అనుకుంటూ ఉండగానే రాముడికి తాను కలిగించిన కష్టం గుర్తొచ్చింది. కాదు కాదు కష్టం కాదు కదా – మృత్యువు. ఒక యువకునికి, తాను రాజు పాత్రలో ఉండి కొడుకుగా చూసుకోవలసిన వాణికి, విధించిన మరణ శిక్ష గుర్తుకొచ్చింది. శంబుకుడు – ఆ పేరు రాముడిని ఎప్పుడూ తొలిచి వేస్తుంది. రాముడు తన ధర్మంలో భాగంగా ఎంతగా వర్ణాశ్రమానికి కట్టుబడి ఉన్నాడంటే, ఒక కుర్రవాడు ఎంత చదువరైతేనేమి, శ్రద్ధగల వాడైతేనేమి శూద్రుడు అయినందు చేత, తన రాజ్యం పై ప్రజలపై పడిన ఏ కష్టమైనా, ఆ కుర్రవాడు తన కులాన్ని మీరి తపస్సు చేయడం వలననే అని నమ్మినాడు. నిర్మూలించాల్సిన ఒక వ్యాధి, చిదిమి వేయవలసిన ఒక చీడపురుగు అన్నట్టుగా హతమార్చినాడు. మరందుకే కదా నామరామాయణంలో “స్వర్గత శంబుక సంస్తుత రామ్” అనడం అంతటి విడ్డూరం. రాముడిని ఆ క్షణం ఆ మాట ఒక ఉరి తాడులా బిగించుకుంది. తన చేతిలో చచ్చిన ఒక వ్యక్తి తనను స్తుతించడం ఏమిటి. “స్వర్గమనం” అంట. ‘భక్తుడు కనుక అలా అని ఊరుకున్నాడు’ అని రాముడికి తోచింది. ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అని తను కావడమే తను చేసిన తప్పుగా భావింపక తప్పలేదు. ఆ ధర్మమే తన చేత ఇన్ని సార్లు అక్షమ్యమైన దూరాలకు తీసుకేల్లినట్టుంది. 

తనను పీడిస్తున్న ఈ పశ్చాత్తాపంలో లేశం అంతయినా తనకు ఆహ్వానం పంపిన ఈ కోట్లాది ప్రజలకు ఇబ్బంది కలిగించిందా?  తులసీదాసు ‘మానసం’ లో వాల్మీకిని రాముడు, వారు నివసించడానికి సరైన క్షేత్రాన్ని సూచించమని కోరినప్పుడు – మునికి టక్కుమని సమాధానం తోచకపోగా, కాస్త విచారించి, అనూహ్యంగా: “చెవులు” అని అన్నాడు, అనగా – రామకీర్తన వినే వారి చెవులు, పైగా స్తుతించే జిహ్వ, దర్శించే కన్నులు, రాముని పేరిట సేవ చేయు కరపాదాలు. కానీ ఇవన్ని కూడా నామరూపాల చుట్టూ సంచరించే వారికి వర్తిస్తాయి. వాల్మీకి ప్రకారం – రాముడి నిజస్థానం ధ్యానించే మనసు మాత్రమే. కానీ రాముని దృష్టిలో తాను దోషాలను ఎంచే వారి మనసులో కూడా ఉంటాడు. ఒక సారి సీతను చూసాడు రాముడు, వెన్ను తిప్పి. ఆమింకా మౌనంగానే ఉంది – నిలుచుంది, తాను మోసే నైతిక భారానిగా. ఇది వరకు లాగు ప్రేమగా దగ్గరకు తీసుకోలేదు. ఈలోగా చరిత్ర పడగలిప్పి బుసలు కొట్టింది – మరణించి, రక్తం అర్పించిన వేలమంది నాదాల రూపంలో. ఇది పట్టభిషేకమేనా? దేనితో అభిషిక్తుడు కాబోతున్నాడు? తానే ఇంత మంది అసురులను చంపినాక, తన సొంత భక్తుణ్ణి సైతం చంపినాక ఏం చెప్పజాలడు ఇప్పుడు? తన కథ యుద్ధానికి శంఖారావంగా మారిందా? 

ఇంత చేసి తనకు వచ్చిన ఆహ్వానం తిరస్కరించలేడేమో. ప్రకృతి నైజం సీతకు తెలిసినంత క్షుణ్ణంగా మరెవరికీ తెలియదు. మరి ఆమె అందులోనే పుట్టి, అందులో నివసించి, నడిచి, చివరికి అక్కడికే చేరింది కదా. ఆమెకు తెలిసిన సూత్రం: రాముడి చరిత అతడు ఆ ఆలయంలోకి ప్రవేశించాలనే నిర్దేశిస్తుంది. తనకు అసహనీయమైన ఆ దర్బారుని అయిష్టంగా తను ఇంటిగా మార్చుకోవలెను. ఆయన మనసు తెలిసిన వారు మూగవారు కావలెను. 

రాముడు తన ప్రపంచాన్ని వదిలి గృహప్రవేశానికి తయారయ్యాడు. 

Leave a comment